ప్రఖ్యాత శాస్త్రవేత్తలు
ఎస్.కె. మిత్రా (1890 – 1963)
చిన్ననాటి అనుభావాలు, ఆసక్తి పెద్దయ్యాక మన జీవితంపై ఎంతో ప్రభావాన్ని చూపిస్తాయి.ఎస్.కె.మిత్రా అటువంటి అసాధారణ శాస్త్రవేత్త చిన్నప్ఫుడు చూసిన సంగతుల గూర్చి బాల్యదశలోనే సంగతుల గూర్చి బాల్యదశలోనే ఆసక్తిని పెంచుకున్న మహామనిషి.అది కలకత్తాలోని ఒక మైదానం. ఆర్.సి.ఛటర్జీ అనే ఆయన బెలూన్లో ఆకాశయానం చేస్తుండగా 9 సం”ల బాలుడు మాత్రం ఆశ్చర్యంగా అదెలా సాధ్యం అయింది?” అని తన ప్రక్కనే ఉన్న తన అతని అన్నను అడిగాడు. అన్నగారు సమాధానం చెప్పలేక పోయారు. ఇంటికి వచ్చి సైన్సు పుస్తకాలలో వెతికాడు.ఆ బాలుడే శిశిర్ కుమార్ మిత్రా 1890 అక్టోబరు 24వ తేదీన అతడు కలకత్తాలో జన్మించాడు.చిన్ననాటి నుంచే అతను చాలా శ్రద్ధగా చదివేవాడు.కాలేజీ విద్యాభ్యసన కాలంలో జె.సి.బోస్,పి.సి.రే వంటి ప్రముఖుల పరిశోధనలు అతన్నీ ప్రభావతం చేశాయి.ఆ ప్రేరణలోనే మిత్రా ” రేడియోసైన్స్ ” ని అధ్యయనం చేయాలనుకున్నాడు. రేడియో శాస్త్రం యొక్క ప్రాధాన్యాన్ని గుర్తించిన మిత్రా ప్రోద్బలం మీదనే భారతీయ విశ్వవిద్యాలయాల్లో ఈ శాస్త్రభోదనావకాశాలు మెరుగయ్యాయని చెప్పవచ్చు. అయనోస్పియర్ గురించి మిత్రా చేసిన పరిశోధనలే ఆయనకి విజ్ఞానశాస్త్రంలో పేరుతెచ్చాయి. భూమి యొక్క వాతావరణపు పైపొర ‘ అయనోస్పియన్ ‘ దీనిలో విద్యుదావేశం కల రేణువులు ఉంటాయి. వీటినే అయానులు అని అంటారు. రేడియో కమ్యూనికేషన్ రంగంలో అయానోస్పియన్ మండలం పాత్రవిశిస్టమైనది. భూమి నుంచి ఎత్తు అయానులస్వభావం ప్రాతిపదికగా అయాను మండలాన్ని D-E-F అని మూడు రకాలుగా విభజించారు.
ఈ పొరల గురించి మిత్రా విశిష్టమైన పరిశోధనలు చేశారు. సూర్యుని నుండి వచ్చే అతినీలలోహిత కిరణాల చర్య వలన అయాను మండలంలో “E” పొర ఏర్పడినదని ఆయన చెప్పాడు. ఈ పొర గురించి అప్పటి వరకు ప్రపంచ శాస్త్రవేత్తలు తర్జనభర్జనలు చేస్తూవచ్చారు. మిత్రా పరిశోధన వారి అనుమానాలకి పుల్ స్టాఫ్ పెట్టింది.1958లో మిత్రాని రాయల్ సొసైటి ఫెలోగా ఎన్నుకొన్నారు.ఆయన పలుబహుమానాలు , పతకాలు గెలుపొందారు. భూ ఉపరితలపు వాతావరణం గురించి 1947లో ఆయన The upper Atmosphere అనే గ్రంథం రాశాడు. ఈ అంశంపై ఇదే తొలిగ్రంథం కావటం విశేషం. అది ప్రపంచ వ్యాపితంగా శాస్త్రవేత్తల ప్రశంసలను అందుకుంది.1963 ఆగష్టు 13వ తేదీన తన 73వ ఏట శిశిర్ కుమార్ మిత్రా మరణించారు.
భూవాతావరణం గురించి,అయాను మండంలం గురించి యేన్నే చిన్న పరిశోధన వెలుగు చూసినా అందులో శిశిర్ కుమార్ మిత్రా పేరు తళుక్కున మెరుస్తుంది.
శాంతిస్వరూప్ భట్నాగర్
శాంతిస్వరూప్ భట్నాగర్ గురించి తెలియనివారుండరు. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చి (CSIR) వారు ఏటేటా ఇచ్చే శాంతిస్వరూప్ భట్నాగర్ బహుమతి ఈయన గౌరవార్ధం ఏర్పరచినదే. భారతదేశం నిండుగా గర్వించదగ్గ శాస్త్రజ్ఞుడు భట్నాగర్.
ఇప్పటి పాకిస్తాన్లో ఉన్న షాపూర్లో ఫిబ్రవరి 21, 1894న భట్నాగర్ జన్మించాడు.చిన్నతనంలోనే తండ్రి చనిపోవటంతో తన తాతగారింట పెరిగాడు. వాళ్ళ తాత ఓ పెద్ద ఇంజనీరు. చిన్ననాటి నుండి సాహిత్యమన్నా, విజ్ఞాన శాస్త్రమన్నా విపరీతమైన ఆసక్తిని పెంచుకున్నాడు. కవిత్వంలో మంచి ప్రవేశముండేది. ఇప్పటి పాకిస్తాన్లొ ఉన్న రావల్పిండి ప్రాంతంలో ఒక బ్రిటిష్ కంపెనీ చమురు అన్వేషణా కార్యక్రమం చేపట్టిన రోజుల్లో ఒక సమస్య ఎదురైంది. చమురు ఉన్న ప్రాంతం బురదమయంగా ఉండేది. పైగా డ్రిల్ చేసిన బురద ఉప్పునీటితో కలిసి గట్టిగా రాయిలాగామారి, డ్రిల్లింగ్కు అంతరాయం కలిగించేది. ఒక దశలో పనిపూర్తిగా ఆగిపోయేది. అపుడు కంపెనీవారు భట్నాగర్ను సలహా కోసం ఆశ్రయించారు.
ఎమల్షన్ కొల్లాయిడ్లతో పరిశోధనలు చేసి 1921లో లండన్ యూనివర్శిటీ నుండి డాక్టర్ ఆఫ్ సైన్స్ పట్టా తీసుకున్న భట్నాగర్ ఈ సమస్యను కూలంకషంగా పరిశీలించి అతిసులభమైన, చవకైన పరిష్కారాన్ని సూచించాడు. డ్రిల్ చేసిన బురదకు జిగురుకలపమని సలహా ఇచ్చాడు. జిగురు కలిపిన బురదకు స్నిగ్ధత(Viscosity) తక్కువై గట్టిపడకుండా ఉండటంతో బ్రిటీష్ కంపెనీ కొన్ని లక్షల రూపాయల నష్టం నుండి బయటపడింది. వెంటనే కంపెనీ వారు ఆయనకు లక్షాయాభై వేల రూపాయలు బహుకరించారు. ఆ సొమ్మున లాహొరు యూనివర్శిటీకి చమురు పరిశోధనల కోసం విరాళంగా ఇచ్చాడు. చూశారా! భట్నాగర్ ఔదార్యం.
భట్నాగర్ చమురు పరిశోధనాభివృద్ధికి ఎంతో కృషి చేశాడు. మైనాన్ని వాసన లేకుండా ఎలా రూపొందించాలో ఈయన తెలియచేశాడు. కిరోసిన్ను శుద్ధి చేయడం. వెలుగును ఎక్కువ చేయటం. ఆదా చేయడం గురించి భట్నాగర్ ఎంతో విలువైన సమాచారాన్ని అందించాడు. పెట్రోలియం నుండి విడుదలయ్యే వ్యర్థ పదార్ధాలను చమురు పరిశ్రమలో ఎలా ఉపయోగించాలో ఈయన పరిశోధించాడు. రెండవ ప్రపంచ యుద్ధకాలంలో ఈయన CSIR కు డైరెక్టరయ్యాడు.
భట్నాగర్ చమురు పరిశోధనల్లో మునిగి తేలుతున్నా మాగ్నటో కెమిస్ట్రీ మీద కూడా దృష్టినిలిపేవాడు. ఈ సమయంలోనే ఆయన వ్యర్థ పదార్థాల నుండి ప్లాస్టిక్స్ చేయడం, రబ్బరు వస్తువులను రూపొందించడం వంటి పరిశోధనలను ముమ్మరం చేశాడు. 1943లో ఈయనను Fellow of the Royal Society (FRS) గా ఎన్నుకున్నారు.
జవహార్లాల్నెహ్రూ హయాంలో ప్రభుత్వం నుండి నిధులను సమకూర్చి చమురు పరిశోధనా వనరులను అభివృద్ధి చేశాడు. ఈనాడు మనదేశంలో చమురు వనరులు, చమురు నిక్షేప స్థావరాలు, అణుఖనిజ పరిశ్రమలు అభివృద్ధి చెందాయంటే అది భట్నాగర్ కృషే అని చెప్పాలి.
అంతరిక్ష శాస్త్రవేత్తల్లో అగ్రగణ్యుడు యు.ఆర్.రావు
ప్రంపంచ ప్రఖ్యాత అంతరిక్ష శాస్త్రవేత్తలలో ఒకడైన డాక్టరు యు.ఆర్.రావు 1932 మార్చి 10న కర్నాటక రాష్ట్రంలోని దక్షిణ కెనరా జిల్లాలో అద్మరు అనే గ్రామంలో లక్ష్మీనారాయణరావు కృష్ణవల్లె దంపతులకు జన్నించారు.వీరి పూర్తిపేరు ఉడిపి రామచంద్రరావు. చిన్ననాటినుండే చదువులో తెలివితేటలు ప్రదర్శంచేవాడు.1953లో వారణాసిలోని హిందూ విశ్వవిద్యాలయం నుండి పోస్టు గ్రాడ్యయేషన్, 1960లో డాక్టరు విక్రం సారాబాయి ఆధ్వర్యంలో పి.హెచ్.డి ని పూర్తి చేశాడు. 1961లో విదేశాలకు వెళ్ళాడు.బోస్టన్ లోని మసాచ్యుసెట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ పోస్ట్ – డాక్టోరియల్ ఫెలోషిప్ ను పొందాడు. అక్కడ కాస్మిక్ రేస్, సోలార్ విండ్స్ పై పరిశోధనలు జరిపాడు. 1963 నుండి 1966 వరుకు టెక్సాస్ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేశాడు.అదే సంవత్సరం భారత్ కు వచ్చి ఫిజికల రీసర్చ్ లేబరేటరీలో సభ్యుడుగా చేరి కాస్మిక్ కిరణాలకు సంబంధించి ఎక్స్-కిరణాలు, గామా కిరణాలపై పరిశోధనలు జరిపాడు.
బెంగుళూరులో ఇస్రోకి డైరెక్టరుగా పనిచేశాడు. ఆర్యభట్ట, భాస్కర్-1, 2 వంటి విజయవంతమైన ఉపగ్రహాలను కనుకొని ప్రయోగించాడు. ఉపగ్రహ సమాచార సౌకర్యార్థం ఎ.ఎస్.ఎల్.వి., పి.ఎస్.ఎల్.వి., జి.ఎస్.ఎల్.వి. వంటి అంతరిక్ష నౌకలను ఆర్బిట్ లోకి ప్రవేశపెట్టారు.
అమెరికా ఉపగ్రహాలైన పయనీర్ 1, 2, 6, 7, 8 మరియు 9 లపై అధ్యయనం చేసి 1973లో నాసాగ్రూప్ అఛీవ్మెంట్ అవార్డు అందుకున్నారు. యూనివర్శిల్ రీసెర్చ్ అవార్డును, పిసి మహల్శోబీస్ మెడల్, యూరీ గెగారియన్ మెడల్, ఆర్యభట్ట అవార్డు ఇలా ఎన్నో జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలను అందుకున్నాడు. భారత ప్రభుత్వం వీరిని “పద్మవిభూషణ్” బిరుదుతో సత్కరించింది. ఈ మహామేధావి నేటికీ అంతరిక్ష పరిశోధనలలో దేశ అభివృద్ధికి పాటుపడుతూనే వున్నారు.
డా.విలియమ్స్
1856లో డేనియల్ హాల్ విలియమ్స్ పుట్టేనాటికి కొంతమంది అమెరికా ఆఫ్రికన్లు ఇంకా బానిసలుగా ఉండేవారు. అయితే అతని తల్లి తండ్రి ఎప్పుడూ బానిసలుగా లేరు. పెన్సిల్వేనియాలో పెద్ద ఇంటిలో వుండే వాళ్ళు అక్కడే వాళ్ళ నాన్న మంగలి షాపు నడిపేవాడు. నాన్న కటింగ్, షేవింగ్ చేస్తూ వుంటే చూస్తూవుండడం బుల్లి విలియమ్స్కు బలే సరదా! అక్కడికి వచ్చే కస్టమర్లు అంతా నల్లవాళ్ళే. వాళ్ళు తాము ఎలా బాధపడిందీ, ఎలా స్వేచ్ఛ పొందిందీ చెపుతూ వుండేవారు. విలియమ్స్కు 11 ఏళ్ళు వచ్చేటప్పటికి వాళ్ళ నాన్న చనిపోయారు. ఏదైనా పని వెతుక్కోవడానికి విలియమ్స్ చాలా చిన్నవాడు. అంచేత చెప్పుల తయారీ నేర్చుకోవడానికి బాల్టిమోర్ వెళ్ళాడు. కొంతకాలానికి స్వంత ఊరువచ్చి ఒక మంగలిషాపులో కుదిరాడు.విలియమ్స్కి బడికి పోవాలని కోరికగా వుండేది. దొరికిన ప్రతి పుస్తకాన్నీ చదివేవాడు. పనిచేస్తూ డబ్బు దాచుకొని ప్రైవేటు స్కూల్ ద్వారా చదివేవాడు.
21 సంవత్సరాలు వచ్చేటప్పటికీ గ్రాడ్యుయేట్ చదువు పూర్తి చేశాడు. అయినా ఇంకా చదవాలని తపన. ఆ పట్టణంలో ఒక డాక్టరును బ్రతిమాలి అసిస్టెంట్గా చేరాడు. వైద్యానికి సంబంధించిన పుస్తకాలు విరివిగా చదివాడు. రెండు సంవత్సరముల తరువాత చికాగో మెడికల్ కాలేజీలో ప్రవేశించాడు. తదుపరి 3 సంవత్సరాలకు MD డిగ్రీ అందుకున్నాడు. ఆ డిగ్రీ ద్వారా ఇక నుంచి వైద్య వృత్తి చేయడానికి నిజమైన డాక్టరు అయ్యాడు.
డా ” విలియమ్స్కి రోగి నలుపా, తెలుపా అనేది చూసేవాడు కాదు. ఆనీ అప్పట్లో చాలమంది చర్మపు రంగు చూసి వైద్యం చేసేవారు. చాలామంది నల్ల దాక్టర్లకు మల్లే ఇతను పనిచేయడానికి ఏ హాస్పిటలూ అనుమతించలేదు. అనాధశరణాలయంలో డాక్టరుగా, రైల్వే కంపెనీలో సర్జనుగా పనిచేసేవాడు. ఒకానొక కాలేజీలో వైద్య శాస్త్రం బోధించేవాడు. వైద్యం చేయడంలో తెల్లవాళ్ళతో సమానంగా నల్లవాళ్ళను చూడకపోవడం విలియమ్స్ను కలవరపర్చింది. పరిస్థితుల్ని మార్చాలనుకొన్నాడు. 1891లో చికాగోలో ప్రావిడెంట్ హాస్పిటల్ నెలకొల్పాడు. అందులో నలుపు, తెలుపు డాక్టర్లు కలిసిపనిచేసేవారు. రోగి చర్మపు రంగుతో సంబంధం లేకుండా అందరికీ ఒకే విధంగా వైద్యం చేసేవారు.
ప్రావిడెంట్ హాస్పిటల్ ఒక గొప్ప విజయమేకానీ అందులో డా ” విలియమ్స్ చేసిన ఒక ఆపరేషన్ వైద్య చరిత్రలో విఖ్యాతమైనది. 1893లో గుండెలో కత్తి దిగబడివున్న ఒక మనిషిని పరీక్షించాడు. ఆ రోగికి లోపల ఏమైందో తెలుసుకొనే అవకాశం డా” విలియమ్స్కు లేదు, ఎందుకంటే ఆ రోజుల్లో ఎక్స్రే మిషన్లు లేవు. “తాను చేయగలిగింది గాయాన్ని తెరిచి చూడడమే.” అని యోచించాడు. అది ప్రమాదమే కానీ ఆ అవకాశం వదులుకుంటే మనిషి చనిపోతాడు. 6 మంది డాక్టర్ల సహకారంతో మనిషి ఛాతీని తెరిచాడు. ఇంకా తెరిచాడు. సమస్యను గుర్తించాడు. తెగివున్న రక్తనాళాన్ని రిపేరు చేశాడు. గుండె చుట్టూ వున్న కండరాల్ని కుట్టేశాడు. మనిషి గుండె కుట్టేయబడింది అనే పెద్ద అక్షరాలతో ప్రపంచం అంతా పేపర్లలో వచ్చింది. మొట్టమొడటి గుండె ఆపరేషన్ను డా” విలియమ్స్ విజయవంతంగా చేశాడు.
పిల్లలూ ! డా” విలియమ్స్ నూతన వైద్య విధానాల్ని కనుక్కోవడానికి ఎంత ధైర్యం చూపేవాడో, వాటిలో విజయం సాధించడానికి అంత జాగ్రత్త వహించేవాడు.
ఆర్ధర్ సి. క్లార్క్
“కాకిలా కలకాలం బతికే కంటే హంసలా ఆరు నెలలు బతికినే చాలు” – అని చెపుతుంది మన తెలుగు వారి సామెత. హంసలాగే కలకాలం బతికిన వారు, అరుదుగానే అయినప్పటికీ ప్రపంచ చరిత్రలో మనకి దొరుకుతారు. అటువంటి అరుదైన వ్యక్తులలో వైజ్ఞానిక కల్పనా సాహిత్య రంగంలో ప్రపంచ ప్రఖాతి గాంచిన ఆర్ధర్. సి. క్లార్క్ ఒకరు. 2007 డిసెంబరు 5వ తేదీనాడు ఆయనకు 90 ఏళ్ళు నిండాయి.”అంతర్జాతీయ టైటాన్” గా పేరు పొందిన క్లార్క్ శ్రీలంకకు పెంపుడు కొడుకు,పుట్టుక రీత్యా ఇంగ్లాండ్లోని ఒక సాధారణ రైతు కుటుంబీకుడు శ్రీలంక,యు.కె.ల రెండిటి పౌరసత్వం పుచ్చుకొన్న ఈయన ప్రపంచ పౌరుడు. “సూర్యుని చుట్టు 90 ప్రదక్షిణాలు పూర్తి చేసిన మీకు ఈ రోజు ఏమనిపిస్తుంది”. అని ఆయనను కొంతమంది స్నేహితులు అడిగారు. ఆ సందర్భంగా ఆయన కొలంబోలోని తన స్వంత ఇంట్లో నుంచి వీడియో ఉపన్యాసం ఇచ్చారు. రోజుకి 15 గం ” నిద్రపోతున్న నాకు సుస్పష్టమైన కలలుకనడానికి బాగా సదవకాశం దొరుకుతోంది. నా శరీరం చక్రాల కుర్చీకి అతుక్కుపోయి ఉన్నప్పటికీ, నా బుర్ర ఈ విశ్వం అంత కలియతిరగడానికి అది ఎంత మాత్రం అడ్డంకి కాదు”. అని చెప్పారు. ఇదే ఆయన ఇచ్చిన చిట్టచివరి వీడియో ఉపన్యాసం. 2008 మార్చి 19వ తేదీ బుధవారం నాడు క్లార్క్ శాశ్వతంగా కన్నుమూశారు.
1962లో ఆయనకు పోలియో వచ్చింది. జీవిత చరమాంకంలో ఆ వ్యాధి లక్షణాలు ప్రబలి క్లార్క్‌ను చక్రాల కుర్చీకి కట్టి పడేసాయి. అయితేనేమిగాక! చివరి దాకా ఆయన టెలిఫొన్, వీడియోల ద్వారా ప్రపంచానికి అందుబాటులోనే ఉన్నారు. పరిపూర్ణమైన, ఫలప్రదమైన అనేకులకు స్పూర్తిదాయకమైన, అత్యంత ఉపయోగకరమైన జీవితాన్ని గడిపారు. 80 ఏళ్ళు నిండిన నాటికే ఆయన వందల కొద్దీ కల్పనిక, అకల్పనిక వైజ్ఞానిక నవలలు, కథలు, వ్యాసాలు రాసారు. తను రాసిన నవలల ఆధారంగా సినిమాలు కూడా తీశారు.
బాలుడిగా క్లార్క్ అకాశంలో నక్షత్రాలను చూస్తూ ఆనందించేవాడు. పల్స్ మేగజైన్‌లలో వచ్చే వైజ్ఞానిక కల్పనా రచనలని చదివేవాడు. ఆయన తల్లి టెలిగ్రాఫిష్ట్‌గాను, తండ్రి టెలిఫోన్ ఇంజనీరుగాను పనిచేశారు. అయితే రెండవప్రపంచ యుద్ధం పూర్తి అయ్యాక క్లార్క్ తండ్రి, తప్పనిసరి పరిస్థితులలో రైతుగా మారాడు. అకాల మరణం పొందాడు. తండ్రి మరణానికి కొద్దిరోజుల ముందే OLAF Step leton రాసిన Last and First Men పుస్తకాన్ని చదివాడు. అది అతనిపై చెరగని ముద్ర వేసింది. అప్పటి నుండే తాను కూడా వైజ్ఞానిక కల్పనా రచనను చేపట్టాడు.
రెండవ ప్రపంచయుద్ధం తరువాత ఓ 30 సంవత్సరాల కాలంలో పరిశీలించి చూస్తే ప్రపంచ వ్యాప్తంగా ముగ్గురంటే ముగ్గురు వైజ్ఞానిక కల్పనా రచయితలు ఉండేవారు. వారు Robert Heinlein, Issac Asimov, Arther. C.clarke వీరు యువతను భాగా ప్రభావితం చేశాడు. యువత అంతరిక్ష శాస్త్రజ్ఞులుగా, ఇంజనీర్లుగా, శాస్త్ర రంగాలలో దిట్టలుగా తయారు కావడానికి వీరి రచనలు బాగా పురిగొలిపాయి. మరీ ముఖ్యంగా నాసాలో చేరిన శాస్త్రవేత్తలు, ఇంజనీర్లపై వీరి ప్రభావం మొండుగా వుంది.
క్లార్క్‌కి గణితంలో మంచి ప్రావీణ్యత వుంది. కాని డబ్బులేని కారణం చేత ఆయన చదువు పాఠశాలలోనే ఆగిపోయింది. మొదట్లో కొన్నాళ్లు ఆడపాదడపా పనిచేసితరువాత ఎలక్ట్రానిక్స్‌లో ట్రయినింగ్ పొంది రాయిల్ ఎయిర్ ఫోర్స్ (RAF) లో రాడార్ స్పెషలిస్ట్‌గా పని చేశారు. ఆ సమయంలో పొందిన అనుభవంతో Glide Path అనే పుస్తకాన్ని రచించారు. ఇది పూర్తిగా వైజ్ఞానిక రచన. యుద్ధానంతరం ఆయన RAF వదిలి కింగ్స్ కాలేజీ లండన్ నుండి భౌతికశాస్త్రం, గణితంలో డిగ్రీ పొందారు. ఆ తరువాత ఖగోళశాస్త్రంలో పిజి చేశారు. 1945లో ఆయన Wire Less పత్రికలో ఒక వ్యాసాన్ని రాశారు. అందులో Geosynchro nous Satillite Orbit లు సమాచార వ్యవస్థలోనూ, వాతావరణంలో శీతోష్ణ పరిస్థితులను ముందుగా అంచనాలు వేసి తెలుసుకొనేందుకూ బాగా పనికి వస్తాయని చెప్పారు. ఈ పరి కల్పనకు క్లార్క్ ఆద్యుడు కాకపోయినప్పటికీ, ఆయన చేసిన ఈ కృషి వల్లే ఆ రంగం బాగా అభివృద్ధి చెందింది. అందుకే 36 వేల కి.మీ. దూరంలోనూన్న Geosynchro nous Satillite Orbit కి “క్లార్క్ ఆర్బిట్” అని Inter national Astromonical Union వారు పేరు పెట్టారు. క్లార్క్ 1000పైగా చిన్న కథలు వ్యాసాలు రాసారు. ఆయన రాసిన Dial.F.Frankenstein కథ ఇచ్చిన ప్రేరణతోనే బ్రిటీష్ కంప్యూటర్ సైంటిస్టు 1989 లో World Wide Web (WWW) ను ఆవిష్కరించారు.
1948లో ఆన రాసిన “The Sentinal” కథను ఆ తరువాత నవలగా మలచి, 2001 Space Udyssy గా సినీమా తీసారు. ఈ సినీమా ఆయనకు అంతర్జాతీయ ఖ్యాతిని ఇచ్చింది. ఈ చిత్రంలో ‘Artificial Intellegence’ అనే పరికల్పన వుంది. తెలివితేటలలో అన్ని విధాలా మనిషిలాగే సంచరించగలిగే యంత్రం ఆయన ఊహించి కల్పించినది – త్వరలోనే వాస్తవ రూపం పొందగలదు. అన్నదే ఆయన విశ్వాసం. “నానో టెక్నాలజీ రంగంలో సంపూర్ణ అభివృద్ధి జరిగిన రోజున కృత్రిమ మేథస్సులు అత్యంత వేగంగా పుట్టుకొస్తాయని” క్లార్క్ నమ్మకంగా చెప్పారు.
అంతరిక్ష రంగ అభివృద్ధికి తోడ్పడిన క్లార్క్ అంతరిక్షంలోకి పోనేలేదు.” అంతరిక్షంలోకి పయనమై నేను పోలేదు అన్న విచారం నాకు లేదు. నా వెంట్రుకలోని DNA ను ఆర్బిట్‌లో ఉంచేందుకు ఏర్పాట్లు చేసుకొన్నాను. ఎప్పుడో మరో కాలంలో ఏ సూపర్ నాగరికత జీవికో అది తారసపడుతుంది. ఆ విధంగా ఆ మరో కాలంలో నేను జీవించి వుంటాను.” అన్నారాయన.
సమాచార సాంకేతిక రంగంలో వచ్చిన అభివృద్ధి వల్ల ఈనాడు ప్రపంచం కుగ్రామంగా మారింది. అయితే ప్రపంచంలో మనుషులందరూ జాతి విభేధాలు లేకుండా స్నేహభావంతో మెలగాలి. మానవులంతా ఒకే కుటుంబంగా వుండాలి. మనము దయ, కరుణ, సహనాలు అలవరుచుకోవాలి. అదే నిజమైన ప్రపంచీకరణ – అంటాడు క్లార్క్. క్లార్క్ వైజ్ఞానిక కల్పనా సాహిత్య రంగంలో ఒక దృవతార ఆయన మరణం. ఒక యుగాంతానికి చిహ్నం అంటే అతిశయోక్తి కాదు.
లూయీ బ్రెయిలీ (1809 – 1852)
పిల్లలూ !
ప్రపంచ అంధులకు జ్ఞాన కవాటాలను ప్రసాదించిన మహనీయుడు లూయీ బ్రెయిలీ 1809 సం. జనవరి 4న పారిస్ దగ్గరలోని “క్రూవే” గ్రామంలో జన్మించాడు.
బాల్యంలో ప్రమాదవశాత్తు రెండు కళ్ళను కోల్పోయి తన 4వ ఏట పూర్తిగా గుడ్డి వాడయ్యాడు. చదువుపై కొడుకు ఆసక్తిని గుర్తించి , పారిస్ లోని అంధుల పాఠశాలలో చేర్చాడు అతని తండ్రి. అప్పటికి అమలులో ఉన్న “లైన్ టైపు”
పద్ధతిలో చదువుకుని, తన ప్రతిభతో చివరికి అదే పాఠశాలలో ఉపాధ్యాయుడుగా ఎదిగాడు బ్రెయిలీ.
పగలు విద్యార్ధులకు బోధిస్తూ, రాత్రులు అంధులు తేలికగా చదవగలిగే, రాయగలిగే లిపి తయారీకై కృషిచేసాడు. 1821 లో ఛార్లెస్ బార్బియర్ అనే సైనికాధికారి, తన సైనికులు చీకటిలో కూడా తాను పంపిన సమాచారం గుర్తించేందుకు 12 ఉబ్బెత్తు చుక్కలతో సంకేత లిపిని తయారు చేసాడు. దీని గురించి తెలుసుకున్న బ్రెయిలీ 12 చుక్కలను ఆరు చుక్కలకు తగ్గించి అవసరమైన రీతిలో వాటిని పేర్చుతూ అక్షరాలను, పదాలను అంకెలను, సంగీత చిహ్నాలను రూపొందించాడు.
ఈ నిరంతర శ్రమవల్ల 1851 లో క్షయ వ్యాధికి గురై 1852 జనవరి 6న మరణించాడు. బ్రెయిలీ శిష్యులు తమ గురువు గారు రూపొందించిన లిపికి గుర్తింపునివ్వాలని పోరాటం చేయగా అతని లిపికి అధికార గుర్తింపునిచ్చి బ్రెయిలీని తమ దేశపు ముద్దుబిడ్డగా కొనియాడింది ఫ్రాన్స్.
ఈ రోజు ప్రపంచ అంధులకు అన్ని రకాల పుస్తకాలు, పత్రికలు ఆ లిపిలోనే వస్తున్నాయి. అందుకే అంధుల మనసుల్లో, వారి మునివేళ్లలో చిరకాలం జీవిస్తూనే ఉంటాడు బ్రెయిలీ.
కె.వి.కె.శర్మ, పి.ఎస్.అనంతసాగర్.
ఒట్టో వలాష్ ( క్రీ.శ. 1847 -1931 )
సుగంధ పరిమళాలు, లేపనాలు, తదితర సువాసనా ద్రవ్యాలు ప్రత్యేకమైన రసాయనిక పదార్థాలు.
భారతదేశం సుగంధాలకు మారుపేరుగా ఉండేది. సుగంధాలు పరిమళాలు ఎక్కువ భాగం సహజంగానే చెట్టు నుంచి, జంతు భాగాల నుంచి లభిస్తున్నాయి. అలాంటి సుగంధాల రసాయనిక నిర్మాణాన్ని కనుగొన్నాక వాటి లక్షణాలే ఉండే విధంగా కృత్రిమంగా కూడా సుగంధ రసాయనిక పదార్థాల్ని ప్రయోగశాలల్లోనూ, పరిశ్రమల్లోనూ తయారు చేస్తున్నారు. పాశ్చాత్య నాగరికత , వాణిజ్య మరియ జీవన విధానం అలవాటయ్యాక మధ్య తరగతి, ఉచ్చ తరగతి ప్రజానీకంలో సుగంధ ద్రవ్యాలు.
పరిమళాల వాడకం హెచ్చయ్యింది.అందాల పోటీలను నిర్వహించి వాటికి ఎప్పుడూ లేని వ్యాపార ప్రతిపత్తిని కల్పించి కోట్లు పోగేసుకుంటున్నారు. అయితే సుగంధ ద్రవ్యాలన్నీ వ్యాపార నిమిత్తమే కాకుండా సత్ప్రయోజనాలు కూడా ఉన్నాయి. వాటిని ఔషధాలల్లోనూ, పానీయాల్లోనూ, ఆహార పదార్థాల్లోనూ, పిండి వంటల్లోనూ, పరిసరాల పరిశుభ్రతకు కూడా వాడుకొంటున్నాము.
ఇలాంటి సత్ప్రయోజనాలను ఆశించి సుగంధ రసాయనిక పరిశోధనల మీద విస్తృత ప్రయోగాలు చేసి కీర్తి గడించిన వాడు 17.3.1847 నాడు రష్యాలో జన్మించి ఆ తరువాత జర్మనీలో స్థిరపడ్డాడు. వల్లాష్ గల్టింగన్ విశ్వవిద్యాలయంలో వోలర్ వద్ద డాక్టరేట్ పట్టా పుచ్చుకున్నాడు. యూరియా తయారీకి పేరెన్నిక గన్న వోలర్ గురించి మీరు వినే ఉంటారు. ఆ తర్వాత 1870 లో ఆగస్ట్ కెకులే వద్ద పరిశోధనలు జరిపాడు. బెంజీన్ పదార్థంలో అణువులు సమ షష్టి భుజి నిర్మాణంలో ఉంటాయని చాటిన వాడు కేకులే. ఇంత గొప్ప వ్యక్తుల దగ్గర పనిచేయడం వల్ల వల్లాష్ కూడా గొప్ప వాడయ్యాడు. ఆయన క్రమేపి సుగంధ ద్రవ్యాల మీద మనసు పడ్డాడు. వివిధ పరిమళ ద్రవ్యాలు, రసాయనికంగా వేర్వేరని అందరూ అంతవరకు భావించేవారు. అయితే అవన్నీ కూడా టర్పీన్ లనే ఒక ప్రత్యేక తరహా రసాయనిక సమ్మేళనాల తరగతికి చెందినవని వల్లాష్ ఋజువు చేశాడు. కర్పూరం, మెంథాల్, సిట్రాల్ వంటివన్నీ టర్పీన్లే ఇలాంటి వందలాది పదార్థాలన్నింటిలోనూ ఒక రసాయనిక నిర్మాణాంశం సార్వత్రికంగా ఉన్నట్లు ఋజువు చేశారు. మొదట కేకులే కూడా ఇవన్నీ వివిధ రకాల పదార్థాలని విశ్వసించారు. వల్లాష్ ఆ రకంగా గురువును మించిన శిష్యుడయ్యాడు. సుగంధాన్ని విరజిమ్మే అనేక వందల పదార్థాలల్లో ఐసాప్రిన్ భాగం సార్వత్రికంగా ఉన్నట్లు సోదాహరణంగా, ప్రయోగ పూర్వకంగా ఋజువు చేసిన వలాష్ ను పరిమళాల పితామహుడు అంటారు. నిరాడంబరతకు, నిస్వార్థతకు పేరిన్నికగన్న వల్లాష్ చేసిన కృషికి గానూ, 1910 సంవత్సరపు రసాయనిక శాస్త్ర నోబెల్ బహుమానం ఈయనను వరించి నోబెల్ బహుమతికి సుగంధం అబ్బింది.
మేరీక్యూరీ (1867 – 1934)
రెండుసార్లు నోబెల్ బహుమతి పొందిన గొప్ప శాస్త్రవేత్త మేరీక్యూరీ (1867 – 1934)
తన అద్వితీయ ప్రతిభాపాటవాలతో రేడియంను కనుగొన్న గొప్ప శాస్త్రవేత్త మేరీక్యూరీ. 19వ శతాబ్దంలో స్త్రీలకు లలిత కళలు, సామాజిక శాస్త్రాలు తప్ప సైన్సు చదవడానికి నిరాకరించేవారు. తన నిరంతర పరిశ్రమ, పట్టుదలతో కృషిచేసి నోబెల్ బహుమతి మొట్టమొదటగా పొందిన ధీరవనిత మేరీక్యూరీ. 1903 ఫిజిక్స్ లోను, 1911 లో కెమిస్ట్రీ లోను రెండుసార్లు నోబెల్ బహుమతులు పొంది చరిత్ర సృష్టించింది.మేరీక్యూరీ 1867 లో పోలెండ్ లో ఒక సామాన్య కుటుంబంలో జన్మించింది.హైస్కూల్ స్థాయిలో అత్యంత ప్రతిభావంతమైన విద్యార్థిగా గుర్తించబడినా పెదరికం వల్ల చదువు మాని, 10 సంవత్సరాల పాటు ధనికుల ఇండ్లలో పిల్లల్ని చూసే సహాయకురాలుగా గడిపింది.
24 సం. ల వయస్సులో కొంత డబ్బు కూడబెట్టుకొని ఆస్ట్రియాలోని క్రాకో యూనివర్సిటీలో చేరబోతే స్త్రీలు సైన్సు చదవడానికి వీలులేదు పొమ్మన్నారు. చివరకు ఫ్రాన్స్ రాజధాని పారిస్ కు వచ్చి ప్రఖ్యాత పారిస్ యూనివర్శిటీలో సైన్స్ విద్యార్థినిగా చేరింది. చేరిన మరుక్షణం నుండి మేరీ తన చదువుపైనే మనసు కేంద్రీకరించి రాత్రింబవల్ళు కృషిచేసింది. పేదరికంలో మగ్గుతున్న తను కొద్దపాటి డబ్బుతో చదువుకోవాలి. ఒక చిన్న గదిలో అతి తక్కువ ఖర్చుతో, అర్థాకలితో, చలి దేశమైన ఫ్రాన్సులో ఎముకలు కొరికే చలి ఉన్నా, చేతులు కొంకర్లు పోతున్నా ఒక్కతే అర్థరాత్రి దాటేవరకు తదేక దీక్షతో చదివేది. చివరి పరీక్షలలో అత్యంత ప్రతిభావంతమైన విద్యార్థినిగా విజయం సాధించింది.
తన పరిసోధనా కృషిలో మేరీకి ప్రఖ్యాత శాస్త్రజ్ఞులు పీరీక్యూరీ తో పరిచయం ఏర్పడింది. పరిచయం అనురాగంగా మారి వారిద్దరూ భార్యాభర్తలయ్యారు. వారి పెళ్ళి మత విశ్వాసాలకు దూరంగా చాలా నిరాడంబరంగా జరిగింది.
రేడియో యాక్టివ్ పదార్థం పిచ్ బ్లెండ్ మీద జరిపిన పరిసోధనా ఫలితంగా మేరీక్యూరీ, పీరీక్యూరీ 1898 లో పోలోనియం కనుగొన్నారు. మేరీ తన స్వదేశమైన పోలండ్ జ్ఞాపకార్థం ఆ కొత్త పదార్థానికి పోలోనియం అని పేరు పెట్టింది. మరికొద్ది నెలల్లోనే వారు ఉభయులూ క్యాన్సర్ చికిత్సకు అతి ప్రధానమైన రేడియంను కనుగొన్నామని ప్రకటించారు. రేడియో అణుభారం 22.5. రేడియం యురేనియం కంటే 20 లక్షల రెట్లు శక్తివంతమైనది. సీసంలో తప్ప మిగిలిన అన్నింటిలో దాని కాంతి రేఖలు ప్రసరించగలవని ఈ యువశాస్త్రవేత్తలు కనుగొన్నారు. రేడియం చాలా ఖరీదైనది. ఒక గ్రామ్ రేడియం విలువ 7 లక్షల 50 వేల గోల్టు ఫ్రాంకులు.
మేరీ పరిసోధనకు ఆమెకు డాక్టరేట్ లభించింది.నోబెల్ బహుమానాన్ని పీరీ దంపతులకు ఇచ్చారు. రేడియో కనుగొనగానే దాన్ని వైద్యశాస్త్రంలో చికిత్స నిమిత్తం వాడడం ప్రారంభించారు. రెడియోపై రాయల్టీ పొందే అవకాశము సైన్సు ఫలితాలు సమాజం కోసం ఉపయోగపడాలన్న ఆశయంతో, తమకు రాయల్టీలు అక్కర్లేదని, విద్య, వైద్య విజ్ఞాన రంగాల్లో దానిని ఎవరైనా ఉత్పత్తి చేయవచ్చని, రేడియంను సంగ్రహించే విదానాన్ని దేశదేశాలవారికి తెలియజేశారు. తన భర్త పీరీ మరణానంతరం ఆమె ప్రాన్సులో సార్ బోర్న్ యూనివర్శిటీలో ప్రోఫెసర్ గా పనిచేసింది. 1914 ప్రపంచ యుద్ధంలో మేరీక్యూరీ X రే పరిశోధనల వల్ల ఆమె ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది. 1934 జూలై 4న మేరీక్యూరి మరణించింది. ఈ రేడియం కనుగొనడం ద్వారా మానవ జాతి కి ఎనలేని సేవచేసిందో ఆ రేడియం కిరణాలు అధికంగా సోకి ఆమె మరణించింది. ఆమె జీవితం బావిశాస్త్రవేత్తలకు ఆదర్శంకావాలి.
బెకెసీ గియర్గాన్ ( 1899-1972 )
బాలలూ టెలిఫోన్లు, రేడియోలు తదితర సమాచార సాధనాలకు సంబంధించిన ఒక ఇంజనీర్ శరీర ధర్మ శాస్త్రానికి సంబంధించిన అంశంలో చేసిన కృషికి గాను నోబెల్ బహుమతి పొందాడంటే నమ్మగలరా ? అయినా ఇది సత్యం. బెకెసీ గియర్గాన్ స్వతహాగా టెలికమ్యూనికేషన్లకు సంబంధించిన ఇంజనీర్. పరిశ్రమల్లో పనిచేసే పారిశ్రామిక శాస్త్రవేత్త. ఈయన మనచెవిలో ఉండే లోపలి చెవి భాగంలో స్ప్రింగులుగా మొత్తగా ఉండే కాక్లియా ఏవిధంగా పనిచేస్తుందో వివరించాడు. వినడం కూడా ఒక రకమైన కమ్యూనికేషన్ కదా.
బెకెసీ గియార్గాన్ 1899 సంవత్సరంలో హంగెరీ లో జన్మించాడు. తరువాత అమెరికాలో స్ధిరపడ్డాడు. మనకు సెల్ ఫోన్లను ఇచ్చే ఒక సంస్ధ సీమన్స్ కంపెనీ. ఇది జర్మనీలో ఉంది. దీన్లో ఆయన ఇంజనీరుగా పనిచేశాడు. 1946 లో స్వీడన్ కు వెళ్ళి అక్కడ పరిశ్రమల్లో పనిచేస్తూనే బోధన వృత్తిని కొనసాగించాడు.
అంతవరకూ పంచేద్రియాల్లో ఒకటైన చెవిఎలా పనిచేస్తుందో కొద్దోగొప్పో అందరికీ తెలిసినా, లోపలిచెవిలో వినికిడి యంత్రాంగం ఎలా పనిచేస్తుందో ఎవరికీ అర్థం కాలేదు. గాలిలోని ధ్వని తరంగాలు చెవిరంధ్రం ద్వారా ప్రయాణించి కర్ణభేరిని కదిలిస్తాయనీ, ఆ కంపనాలు చెవిలో ఉన్నప్పుడు చిన్న ఎముకల గొలుసుద్వారా, కాక్లియాకు ప్రయాణిస్తాయనీ మాత్రమే అంతవరకు తెలుసు. అయితే కాక్లియా ఎందుకు స్ప్రింగులాగా ఉందని గానీ ఆ తరువాత కాక్లియాలో ఏ చర్యలు జరగడం ద్వారా మెదడుకు సంకేతాలు వెళతాయన్న విషయంపట్ల ఎవరకీ అవగాహన లేదు. యాంత్రిక సంకేతాలు విద్యుత్ సంకేతాలుగా మారడమెలాగో అర్థంకాలేదు. గియర్గాన్ హార్వర్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా పనిచేస్తూ అక్కడే చెవిపనిచేసేవిధానం పట్ల లోతైన పరిశోధనలు చేశారు. కాక్లియా నమూనాలను తయారు చేసి ఆ నమూనా గోడలు మందాన్ని మారుస్తూ వాటిలో రకరకాల ద్రవాలను నింపి ఆ ద్రవాల్లో అల్యూమినియం పొడిని కలిపి విద్యుత్ సంకేతాలు పంపేవాడు. ధ్వని తరంగాలను పంపి వివిధ ప్రాంతాల్లో వివిధ మోతాదుల్లో ధ్వని వ్యతిరేకంగా గుర్తించాడు. ధ్వనితరంగాలు కాక్లియాలోని ద్రవం గుండా ప్రయాణిస్తూ కంపనాలను కలిగిస్తాయనీ పీజో ఎలక్ట్రసిటీ లనే దృగ్వియం ద్వారా ధ్వని తరంగాలు విద్యుత్ తరంగాలుగా మారతాయనీ, అవి కర్ణనాడుల ద్వారా మెదడుకు చేరుతాయని వివరించాడు.
ఈయన చేసిన కృషికి గుర్తింపుగా 1961 సంవత్సరపు వైద్యశరీర ధర్మాల రంగపు నోబెల్ బహుమతి ని గియార్గన్ కు బహుకరించారు.
పిల్లలు చూశారా ఇంజనీర్ అయినా ఇతర రంగాల్లో కూడా అవగాహన ఉండడం వల్ల అంతరీయ రంగాల పరిశోధనలెలా వీలవుతాయో ! మీరు కూడా విజ్ఞానాన్ని అన్నికోణాల్లో అవగాహన చేసుకోవాలి(ఎన్ సైక్లోపీడియా ఆఫ్ బ్రిటానికా సౌజన్యంతో)
ప్రాణి మూలాన్ని తెలియజేసిన – “ఫ్రాంసిస్ క్రిక్”
విజ్ఞానశాస్త్రం మానవ జీవితాన్ని అనేక విధాలుగా ప్రభావితం చేస్తూ వుంది. ఈనాడు జీవకణ శాస్త్రం, బయోటెక్నాలజీ కొత్త పుంతలు తొక్కడం, మానవిని జీవరహస్యాన్ని ఛేదించే దశకు చేరడానికి అవకాశం కల్పించిన శాస్త్రవేత్తలలో “ఫ్రాంసిస్ క్రిక్” ముఖ్యులు. ఆధునిక జీవశాస్త్ర శిల్పిగా ప్రపంచమంతా ఈయనను గుర్తించింది.
ఫ్రాంసిస్ క్రిక్” తన మిత్రుడైన జేమ్స్ వాట్స న్ తో కలిసి “D.N.A” (డీఆక్సీ రైజో న్సూక్లి క్ ఆసిడ్)
నిర్మాణాన్ని బహిర్గతం చేయడం జన్యుశాస్త్ర విస్తరణకు ఎంతగానో తోడ్పడింది. వీరి పరిశోధనలు 19వ శతాబ్దపు డార్విన్ పరిణామ సిద్ధాంతం, మెండల్ అనువంశిక సిద్ధాతాల కొనసాగింపుగా బావించవచ్చు.
మనం నేడు జీవశాస్త్ర లోతుల్లోకెళ్ళి జన్యు మార్పిడి ద్వారా జీవి లక్షణాన్ని మార్చగలిగే స్థాయికి చేరేందుకు పునాదు లేసిన ఫ్రాంసిక్ క్రిక్ ప్రారంభదశలో జీవశాస్త్ర వేత్తకాదంటే నమ్మబుద్దికాదు. ఈయన ఇంగ్లాండ్ కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో భౌతిక పరిశోధనా విద్యార్థిగా వున్నప్పుడు రెండవ ప్రపంచ యుద్ధంలోకి వెళ్లాల్సి వచ్చింది. ఆ కాలంలో ఆయనకు జీవశాస్త్రం పై అభిరుచి కలిగి జీవరసాయన శాస్త్రాల అధ్యయనానికి పూనుకొన్నాడు. కణరసం భౌతిక లక్షణాలపై పరిశోధన చేపట్టాడు. క్రమంగా జన్యువుల అమరికను గురించి అర్థంచేసుక ని, అమైనో ఆమ్లాల ఆధారితమైన “D.N.A” యొక్క రూపాన్ని అవిష్కరించారు. జేమ్స్ వాట్స న్ తో కలిసి క్రిక్ చేసిన పరిశోధనకు 1962 లో నోబెల్ బహుమతి లభించింది.
ఆనాటికి క్రిక్ కు డాక్టరేట్ కూడాలేదు. క్రిక్ తన పరిశోధన కొనసాగింపుగా జీవి శరీర నిర్మాణానికి కీలకమైన మాంసకృత్తులు ఏరంకంగా తయారవుతాయో తెలిపాడు.
క్రిక్ జీవితం కూడా ఆదర్సప్రాయం. నిరాడంబర జీవితం గడిపారు. బహుమతులకు వెంపర్లాడలేదు. ప్రపంచ స్థాయిలో తాను పొందిన గుర్తింపును ప్రచారాలకు వ్యాపారానికీ వాడుకోలేదు. అందుకే ఆయనకు 1999లో ఇంగ్లాండ్ దేశ అత్యున్నత అవార్డు ఆర్డర్ ఆఫ్ మెరిట్ ఇచ్చారు. ప్రజా సైన్స్ ఉద్యమాల మార్గదర్శి డా. డె.డి. బెర్నాల్ వంటివారి పరిశోధనలు, క్రిక్ పరిశోధనల ప్రభావితం చెయ్యడం మరో విశేషం.
తన పరిశోధనా ఫలితాల పునాదులపై విస్తరిస్తన్న జీవసాంకేతిక రంగాన్ని క్రిక్ తన జీవిత కాలంలోనే చూడగలడం విశేషం. మానవ జన్యువు లక్షణాలు విశదంగా క్రోడీకరించగల శాస్త్రరంగ అన్వేషణ క్రమంలేనే ఫ్రాసిస్ క్రిక్ 2004 జూలై 28వతేది (తన 88వ ఏఠ) తనువు చాలించాడు. ప్రజాశాస్త్రవేత్తగా మన హృదయాలలో నిలిచిపోయాడు.
ప్రభుత్వ పాటశాలలో చదివే వారికీ ఉన్న వివరాలు అందచేయండి.